గీతిక జాబ్ కోసంమని ట్రై చేయడానికి వెళ్లగా తన కంపెనీలో సెలెక్ట్ అయ్యావు అని ఎండి చెప్పడంతో సంతోషించి బయటకు వస్తుంది. ఇప్పుడైనా చంద్రహాస్ ఎక్కడన్నా కనిపిస్తాడేమోనని చూస్తూ ఉన్న ఎక్కడ కనిపించకపోయేసరికి తనకు దప్పిక అనిపించడంతో పక్కనే కనిపించిన ఫ్రూట్ జ్యూస్ షాపులోకి వెళ్లి, ఓ మూలగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
“ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి,” అంటూ డబ్బులు తీసేందుకు తన బ్యాగ్ తెరిచింది.
బాటిల్ చేతికి అందుకున్న గీతిక మూత తీసి రెండు గుక్కల నీళ్లు తాగింది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న సర్టిఫికెట్ల ఫైల్‌ను సరిచేసుకుంటూ, ముందున్న టేబుల్‌పై చూపు నిలిపింది.
అంతలోనే “హాయ్ డార్లింగ్! ఏం కావాలో చెప్పు. ఈరోజు నీకు నచ్చినవన్నీ తీసుకో. నువ్వు అడిగితే కాదనేవాడిని కాదు కదా!” అన్న మాటలు వినిపించేసరికి,
ఆ గొంతు వినగానే గీతిక చేతిలోని బాటిల్ కదలకుండా ఆగిపోయింది.ఆ గొంతు ఆమెకు బాగా పరిచయం.తలెత్తి చూసింది. ఇంకెవరు అక్కడ... తన పిన్ని కొడుకు చంద్రహాస్!
అతడి ఎదురుగా ఓ అమ్మాయి కూర్చుని ఉంది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆమె ఏదో చెప్పగానే చంద్రహాస్ కూడా నవ్వాడు.
అంతలో ఆ అమ్మాయి జ్యూస్ గ్లాసును చేతిలోకి తీసుకుని, చంద్రహాస్ వైపు చూసి నవ్వుతూ
“చంద్రా... ఒక విషయం అడగనా?” అన్నది.
“అడుగు డార్లింగ్!” అంటూ చలాకీగా చూస్తున్నాడు చంద్ర.
“నిన్న నీ బైక్ వెనకాల ఓ అమ్మాయి కూర్చుని వెళ్లింది కదా! ఎవరు తను?”
"తన పేరు గీతిక" అని చెప్పిన చంద్రహాస్ ముఖంలో చిరాకు కనిపించింది.
“ఎవరా గీతిక!”నీకు అంత క్లోజా?” అంటూ ఆ అమ్మాయి మరొక ప్రశ్న వేయగా
“అంత క్లోజేం కాదు. ఏదో బంధువు వరుస అవుతుంది.”
“ఏంటో... అంత అందమైన అమ్మాయి నీ బైక్ వెనకాల కూర్చుంటే నాకు ఎలా ఉంటుంది? పైగా బంధువు అని చెప్తున్నావు ,నువ్వు తనను తీసుకెళ్తుంటే నాకు అస్సలు నచ్చలేదు.”అన్నది ఆ అమ్మాయి మళ్లీ అతడి ముఖంలోకి చూసి.
ఈసారి ఆమె గొంతులో అసూయ స్పష్టంగా వినిపించింది.
.“ఓసీ పిచ్చిదానా! నువ్వు మరీనూ! దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్నాడు.”చంద్రహాస్ నవ్వుతూ.
“ఏరా చంద్రా! నువ్వే కదా ఒకసారి ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుందని చెప్పావు? మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి?” అన్నాడు అతడి పక్కనే కూర్చున్న స్నేహితుడు జ్యూస్ తాగుతూ మధ్యలో కల్పించుకుo టూ..
అంతలో చంద్రహాస్ మాత్రం స్నేహితుడి మాటకు వెటకారంగా నవ్వాడు.“ఛీ! అది నా చెల్లా? బల్లా ? ఏదీ కాదు! ఇంతకీ అది మా పెద్దమ్మకు పుట్టిందనుకుంటున్నారా? ఎవరో పడేసిన ఒక అనామిక!” అన్న మాటలు గీతిక చెవుల్లో పిడుగుల్లా పడ్డాయి. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గీతికచేతిలోని బాటిల్ పై వేళ్ళు బిగుసుకున్నాయి. ఆమె చేతిలోని బాటిల్‌ను తెలియకుండానే బలంగా నలిపేసింది.అందులోని నీళ్లన్నీ ఆమె ఒడిలోకి, నేలమీదకు కారిపోయాయి.మనసులో మాత్రం చంద్రహాస్ కాలర్ పట్టుకుని, చెంపలు వాయించి, తన గురించి అలా మాట్లాడే హక్కు ఎవరిచ్చాడని నిలదీయాలనే ఆగ్రహం రగులుతోంది. లేచి వెళ్లి అడుగు గీతికా! నీకు ఎందుకు ఆ హక్కు లేదు? నిన్ను అవమానించే ముందు ఒక్కసారైనా నీ మనసు గురించి ఆలోచించలేదా అని అడుగు! అంటూ ఆమె మనసు ఆమెను ప్రేరేపిస్తోంది.కానీ మరుక్షణమే పబ్లిక్ లో ఉన్నాను ఇక్కడ ఏమీ మాట్లాడలేను అన్న ఆలోచన ఆమె అడుగులను వెనక్కి లాగింది.
అంతలో “ఏరా! నాతో ఒక్క మాట చెప్పకూడదా? నాకు జోడి లేదని నీకు తెలుసు కదా! వాలెంటైన్స్ డేకి హాయిగా ఎంజాయ్ చేసేవాడిని.” అన్న ఆ మాటకు చంద్రహాస్ పగలబడి నవ్వాడు.
“పోయి పోయి శనిని తీసుకుని సంతకు వెళ్లినట్టుగా, దాన్ని నీ జతకి కావాలంటావేంట్రా? అది ఎక్కడుంటే అక్కడే కష్టాలు! సమస్యలు! దాని ముఖం చూస్తే చాలు, ప్రశాంతంగా ఉన్నవాడికి కూడా ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది.”“అది అదృష్టం లేని పిల్ల. దాని జీవితమే ఓ దరిద్రం. దానికి తోడుగా ఉన్నవాళ్లకూ అదే అంటుకుంటుంది. అలాంటి దాన్ని తీసుకెళ్లి వాలెంటైన్స్ డే జరుపుకోవాలా? నీకేమైనా పిచ్చా?"
అంటే చేతివేళ్లు చూపిస్తూ ఉంటే,
ఆ మాటలు వింటున్న గీతికకు ఒళ్లంతా తేళ్లు జెర్రెలు పాకినట్టు ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటా తన గుండెల్లో దిగుతున్న బాణంలా అనిపించింది .ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు జారిపడుతున్నాయి.అవి తుడుచుకోవాలని అనిపించినా, చేతులు కదలడం లేదు. నేను మా అమ్మ నాన్న జీవితాల్లోకి వెళ్లి ఏం అడిగాను?వాళ్లను బాధపెట్టానా? వాళ్ల ఆనందాన్ని దూరం చేశానా?కేవలం నేను పుట్టినందుకే... నా చేతుల్లో లేని నా గతం కారణంగా... నన్ను ఇంతలా అవమానించాలా?గీతిక పెదవులు వణికాయి.ఆమె కళ్ల ముందు ఉన్న ప్రపంచం మసకబారిపోయింది.
చంద్రహాస మాటలు మళ్ళీ వినిపించాయి“అది నా చెల్లి కాదు రా! ఎవరో పడేసిన అనామిక అంతే!”ఈసారి ఆ మాటలు ఆమె చెవుల్లోనే కాదు, గుండెల్లోనూ ప్రతిధ్వనించాయి.
అనామిక...పేరు లేనిదాన్నా? బంధం లేనిదాన్నా?లేక ఈ ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం లేనిదాన్నా? గీతిక ఇక అక్కడ కూర్చోలేక నెమ్మదిగా లేచి ఆమె కౌంటర్ దగ్గరకు వెళ్లకండ అలా బయటకి నడుస్తుంటే.
“మేడమ్... బాటిల్ డబ్బులు!” అని అక్కడున్న అబ్బాయి గుర్తుచేశాడు.
గీతిక తన బ్యాగ్‌లోంచి వంద రూపాయల నోటు తీసి ఇచ్చింది.
“ఒక్క నిమిషం మేడమ్... చిల్లర తీసుకొస్తాను,” అంటూ అతడు లోపలికి వెళ్లాడు. అంతలో గీతిక మరోసారి వెనక్కి చూసింది.చంద్రహాస్ ఇంకా తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది.తనకు రావాల్సిన చిల్లర గురించి కూడా ఆలోచించకుండా, తల వంచుకుని వేగంగా బయటకు నడిచింది.
ఫ్రూట్ జ్యూస్ షాపు నుంచి ఆ ప్రేమజంట బయటకు వచ్చింది. నవ్వుకుంటూ, ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ బైక్ దగ్గరకు చేరుకున్నారు. చంద్రహాస్ తన ప్రేయసిని బండిపై ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళాగా , అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చి బండికి అడ్డంగా నిలబడింది.
చంద్రహాస్ చిరాకుగా బ్రేక్ వేశాడు.
“ఎవరది? దారికి అడ్డంగా వచ్చి—” అంటూ తలెత్తి చూసిన అతని మాటలు గొంతులోనే ఆగిపోయాయి.
ఎదురుగా నిలబడి ఉన్నది గీతిక!
“నువ్వా!” అన్నాడు ఆశ్చర్యంతో కూడిన అసహనాన్ని ముఖంలో ప్రదర్శిస్తూ.
“ఆ! నేనే!” గీతిక గొంతులో ఆగ్రహం ఉప్పొంగింది. “ఏరా చంద్రహాస్! నేనేమైనా అనామికనా? నీకు శనిలా దాపురించానా? ఆ అన్నం తినే నోటితో ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయిరా? నిన్ను నా తమ్ముడిగా భావించాను. నా గురించి నీకు తెలియదా? అయినా నన్ను చూసి నీకెందుకింత అసహ్యం? "ఒక అమ్మాయి అన్న కనికరం కూడా లేదా?
ఎవరే నువ్వు నువ్వు నన్ను తమ్ముడిగా భావించడమేంటి నేను ఏమైనా నీ అమ్మకి పుట్టానా నువ్వే ఒక అనామిక అని మరొక్కసారి చెయ్యి చూపిస్తూ మాట్లాడుతుంటే గీతికా తన గుండెల్లోనే బాధని తట్టుకోలేకపోతోంది .
అంతలో చంద్రహాస్ లవర్ కల్పించుకుని ఏయ్!నా బాయ్‌ఫ్రెండ్‌నే నిలదీస్తావా?” అంటూ గీతికపై చేయి ఎత్తింది.
ఆమె చెయ్యి గీతిక చెంపను తాకేలోపే గీతిక ఆ చెయ్యిని అడ్డుకుంది. ఆవేశంతో ఆమె చెంపపై ఒక్కటి కొట్టింది.
ఛెళ్లుమన్న శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చీల్చింది.
“నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం?” అంటూ ఆ అమ్మాయి గీతికపైకి దూసుకొచ్చింది.
చంద్రహాస్ కూడా బండిపై నుంచి దిగాడు.
“ఏంటే! ఊరికే ఉంటే రెచ్చిపోతున్నావా? నిన్ను—”
అంటూ గీతికపై చేయి ఎత్తబోయాడు.గీతిక అతని చొక్కా కాలర్‌ను గట్టిగా పట్టుకుంది.
“ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నన్ను ఇంతగా అవమానిస్తావా అనామికనని పదే పదే మాట్లాడతావా? నేను మనిషినే కదా అంటే ఇంకా గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటల్లో తన ఆవేదనే ఎక్కువగా ఉంది.
చంద్రహాస్ కళ్లలో కోపం ఎర్రగా కమ్ముకుంది.“ అవును నువ్వు అనాధవే అది నిజం కాదా నీవల్ల మా పిన్ని ఎంత ఇబ్బంది పడింది ఇంత చేసింది కాకుండా ఇంకా మాట్లాడతావా?” అసలు నువ్వే భూమ్మీద ఉండకూడదు అంటూ ఆమెను బలంగా వెనక్కి తోశాడు.
గీతిక తూలిపడబోయి నిలదొక్కుకుంది. వెంటనే అతని ప్రేయసి ఆమె భుజం పట్టుకుని లాగింది. ఇద్దరూ కలిసి ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.
“వదలండి!” గీతిక విదిలించుకుంది.కానీ వాళ్లు వినలేదు.
“నువ్వు ఎక్కువ చేస్తున్నావ్!” అంటూ ఆ అమ్మాయి గీతిక వేసుకున్న ఓణీని పట్టుకుంది. చంద్రహాస్ కూడా మరోవైపు దానిని లాగాడు. క్షణాల్లో ఆ ఓణీ గీతిక మెడ చుట్టూ బిగుసుకుంది.
“వదలండి! ఊపిరాడటం లేదు!” అంటూ గీతిక వారి చేతులను తొలగించడానికి ప్రయత్నించింది.
ఇంకా ఏంటి నిన్ను వదిలేది ఏ డార్లింగ్ ఎలాగూ రోడ్డుకి కాస్త ఈ పక్క పడింది కాబట్టి కేసు మన మీద రాదు దానిని ఎక్కడ ముట్టుకోవద్దు నలిపిన వానిని మనమే తీసుకెళ్లి ఎక్కడైనా అగ్గిలో కాల్చేద్దాం అనగానే ఇంకాస్త బిగుతుగా లాగడంతో గీతిక ప్రాణాలు గాలిలో గిలగిలా కొట్టుకున్నాయి. కళ్లలో భయం కమ్ముకుంది. ఊపిరి అందక గొంతు నుంచి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. కాళ్లు తడబడుతూ నేలను తన్నుతున్నాయి. తనను విడిపించుకోవడానికి ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ వాళ్లు మరింత క్రూరంగా అడ్డుకున్నారు.
“చాలు! చచ్చిపో! నీ పీడ విరగడైపోతుంది!” మా పిన్ని వాళ్ళ అయినా ప్రశాంతంగా ఉంటారు అని చంద్రహాస్ కసిగా అన్నాడు.
ఆ మాట వినగానే గీతిక కళ్లలో నీళ్లు తిరిగాయి.
అంతలో దూరం నుంచి పోలీస్ జీపు హారన్ గట్టిగా వినిపించింది. పోలీసుల జీపు దిగి అటువైపే వస్తూ ఉండగా చంద్రహాస్అతని ప్రేయసి గీతికను ఒక్కసారిగా దూరంగా తోసేశారు. వెంటనే బైక్ ఎక్కి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.
గీతిక రోడ్డు పక్కన పడిపోయింది.
మెడకు చుట్టుకున్న ఓణీని వణుకుతున్న చేతులతో తొలగించుకుంది. ఊపిరి పీల్చుకోవడానికి దగ్గుతూ, ఆయాసంతో విలవిల్లాడింది.. గొంతు మండుతోంది. శరీరమంతా వణుకుతోంది.
పోలీస్ జీపు ఆమె దగ్గర ఆగింది.
ఇద్దరు పోలీసులు కిందకు దిగి ఆమె దగ్గరకు వచ్చారు. “ఏమైంది అమ్మా? ఏమైనా సమస్యా?” అని ఒకరు అడిగారు. గీతిక వారి ముఖాల్లోకి చూసింది. ఇప్పుడే జరిగినదంతా చెప్పాలా? నమ్ముతారా? నమ్మినా ఏం చేస్తారు?
ఆమె పెదవులు కదిలాయి. “నో...” అంటూ తల అడ్డంగా ఊపింది.
పోలీసులు ఒకసారి ఆమెను చూసి నీరసంగా కనిపిస్తోంది బహుశా కల తిరిగి పడిపోయే ఉండొచ్చు అనుకునకా తమ దగ్గర అన్న వాటర్ బాటిల్ ఇచ్చేసరికి తన కొన్ని నీళ్లు తాగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలని అడగగా మా ఇల్లు ఎక్కడ సర్ పడతానని చెప్పడంతో వాళ్లు జీపులోకి ఎక్కి వెళ్లిపోయారు.
జీపు దూరంగా కనుమరుగయ్యేవరకు గీతిక అక్కడే నిలబడింది.
ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె మోకాళ్లు బలహీనపడ్డాయి. రోడ్డు పక్కనే చతికిలబడిపోయింది.
“ఆఆఆ...!”
ఆమె గొంతులో నుంచి వెలువడిన ఆర్తనాదం చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చింది.
“నేనేం పాపం చేశాను దేవుడా? నన్నెందుకిలా పుట్టించావు? నన్నెందుకిలా బతికిస్తున్నావు?”
ఆమె రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకుంది.
“ఈ భూమ్మీద నేను ఎందుకు బతికి ఉన్నాను? నన్ను అసహ్యించుకునేవాళ్ల మధ్యే ఎందుకు నా జీవితం ఇలా నలిగిపోవాలి? నమ్మినవాళ్లే నన్ను మోసం చేస్తే ఇంకెవరిని నమ్మాలి? నా కన్నీళ్లకు విలువే లేదా? నా బాధ ఎవరికీ కనిపించదా?”
ప్రశ్నలు ఒక్కొక్కటిగా ఆమె గుండెల్లో నుంచి బయటకు వస్తున్నాయి. కానీ సమాధానం చెప్పేవారెవరూ లేరు.
“నేను శనిలా దాపురించానా? అవును... బహుశా నిజమేనేమో!” అంటూ ఆమె తనను తానే నిందించుకుంది.
“కన్నవాళ్లకు బరువైపోయాను. పెంచినవాళ్లకు భారమయ్యాను మరి నేను ఎవరికి కావాలి? ఈ ప్రపంచంలో నాకంటూ ఒక మనిషి కూడా లేడా?”
ఆమెకు చిన్నప్పటి నుంచి ఎదురైన అవమానాలన్నీ ఒక్కసారిగా జ్ఞాపకానికి వచ్చాయి.
తనను ఓదార్చాల్సిన చేతులే దూరమయ్యాయి. తన కన్నీళ్లను తుడవాల్సిన మనుషులే వాటికి కారణమయ్యారు. తనను ఆదరించాల్సిన బంధాలే తనకు గాయాలుగా మిగిలాయి.
అనాథ అనే ఒక్క మాట తన జీవితంలో ఎన్ని తలుపులను మూసేసిందో, ఎన్ని రాత్రులు నిద్రను దూరం చేసిందో ఆ చిన్న గుండెకు మాత్రమే తెలుసు.
“నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనెంత కుమిలిపోయానో ఎవరికీ తెలుసు? బయట నవ్వుతూ కనిపిస్తే నా మనసులో బాధ లేదనుకుంటారా? అందరి ముందు మౌనంగా ఉంటే నాకు ఆత్మాభిమానం లేదనుకుంటారా? నా గురించి తీర్పులు చెప్పే ముందు ఒక్కసారి నా గుండెలోకి తొంగి చూడాలని ఎవరికీ అనిపించదా?”
గీతిక గొంతు బొంగురుపోయింది.“అటు అమ్మ నా మీద ద్వేషం పెంచుకుంది. ఇటు నాన్న నన్ను అపార్థం చేసుకుని వెళ్లిపోయారు. నన్ను ప్రేమించాల్సిన వాళ్లే నన్ను అర్థం చేసుకోలేకపోతే, ఇక ఈ ప్రపంచంలో నాకు అండగా నిలబడేవాళ్లు ఎవరు?” అంటూ ఆకాశం వైపు చూసింది.
“చివరికి ఆ దేవుడు కూడా కళ్లుమూసుకుని వెళ్లిపోతున్నాడా? అందరి బాధలు వినే దేవుడికి నా ఏడుపు మాత్రం వినిపించడం లేదా?”
సాయంత్రం చీకట్లు మెల్లగా కమ్ముకుంటున్నాయి. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. వాటి హెడ్‌లైట్ల వెలుగు గీతిక ముఖం మీద పడి మాయమవుతోంది. ప్రపంచం తన దారిన తాను పరుగులు తీస్తోంది. కానీ ఆమె జీవితం మాత్రం అక్కడే నిలిచిపోయింది.
ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది.
“ఇక చాలు!” అని తనలో తాను అనుకుంది. “ఎన్నాళ్లని ఈ మాటలు భరించాలి? ఎన్నిసార్లు నా మనసును చంపుకోవాలి? అనాథ అనే మాటతో ప్రతిసారీ నా ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి?”
కొన్ని క్షణాలు మౌనంగా నిలబడింది.
“అప్పుడే ఎక్కడో ఒక అనాథాశ్రమంలో వదిలేసి ఉంటే బాగుండేది. కనీసం తల్లిదండ్రులు, అన్నదమ్ములు అనే బంధాల రుచి తెలిసేది కాదు. వాళ్ల ప్రేమ కోసం మనసు తపించేది కాదు. వాళ్లు నన్ను వదిలేశారనే బాధ ఇంతలా వెంటాడేది కాదు.”
ఆమె కన్నీళ్లు తుడుచుకుంది.
“అనాథాశ్రమాల్లో పెరిగి గొప్ప స్థాయికి ఎదిగినవాళ్లు ఎంతమంది లేరు? తమ కష్టాలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినవాళ్లు ఎంతమంది లేరు? వాళ్లకు బంధాలు లేకపోయినా లక్ష్యాలు ఉన్నాయి. జీవితాన్ని గెలవాలనే పట్టుదల ఉంది. మరి నాకు ఎందుకీ శిక్ష?”
ఆమె గొంతులో బాధ నిండిపోయింది.
“అయితే వాళ్లను తిట్టుకుని ఏం లాభం? నా శాపాలతో వాళ్ల జీవితాలు మారిపోవు. వాళ్ల వెంట అదృష్టం ఉన్నంతవరకు వాళ్లు సంతోషంగానే ఉంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి జీవితంలో ఏ మలుపు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?”
ఒక్క క్షణం ఆగి, తన కన్నీళ్లను బలవంతంగా అదిమిపెట్టుకుంది.
“ఎవరినీ శపించను. ఎవరినీ తిట్టను. నా బాధకు నేనే సమాధానం వెతుక్కుంటాను.”
కానీ ఆమె మనసు అప్పటికే తీవ్రంగా గాయపడిపోయింది. ఆశలు ఒక్కొక్కటిగా రాలిపోయాయి. తనను తాను ప్రేమించుకోవాలనే ఆలోచన కూడా ఆ క్షణంలో ఆమెకు దూరమైంది.
“ఇక ఈ బాధను భరించలేను...” అని గొణుక్కుంటూ రోడ్డు వైపు అడుగులు వేసింది.
ఆ అడుగుల్లో తడబాటు లేదు. కానీ అది ధైర్యం కాదు; కన్నీళ్లన్నీ ఎండిపోయిన తర్వాత మిగిలిన మొద్దుబారిన వేదన.
ఒక చిన్న వాహనం ఎదురుగా వచ్చింది.
“ఏయ్! తప్పుకో!” అంటూ డ్రైవర్ అరిచాడు.
గీతిక పక్కకు జరగలేదు. అతను చివరి క్షణంలో పక్క నుంచి దాటించుకుని వెళ్లిపోయాడు.
మరో వాహనం వచ్చింది.
“కళ్లేమైనా కనిపించడం లేదా? రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నావు?” అంటూ డ్రైవర్ కసురుకున్నాడు.
గీతిక ఏమీ మాట్లాడలేదు.
ఆమెకు తన ప్రాణం మీద నమ్మకం లేదని కాదు. తన ప్రాణానికి విలువ ఉందని నమ్మించే ఒక్క మనిషి కూడా ఆ క్షణంలో కనిపించలేదు.
ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు మళ్లీ జారాయి. వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
దూరంగా ఒక పెద్ద వాహనం వేగంగా వస్తోంది.
దానివైపు చూసిన గీతిక మనసులో చివరి ఆశ కూడా ఆరిపోయినట్లయింది.
“ఇక చాలు... ఇక ఎవరికీ నేను అవసరం లేదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు నేను మరణించాలి...” అని తనలో తాను అనుకుంది.
రోడ్డు మీద వేగంగా వస్తున్న ఒక వాహనం దగ్గరపడుతోంది.గీతిక రోడ్డుపైకి అడుగు వేసింది.