om saravana bhava - 5 books and stories free download online pdf in Telugu

ఓం శరవణ భవ - 5

                                  మనసు చెదిరినట్లు నటించిన మహాదేవుడు  లిప్తకాలం మూడో నేత్రం కొద్దిగా తెరిచి  మన్మధుని వైపు దృష్టి సారించాడు .  ఆ స్వల్ప వీక్షణానికే సుమశరుడు భస్మావశిష్టమైపోయాడు .   ఈ ఘోరానికి తల్లడిల్లిపోయింది  రతీదేవి  శంకరుని  పాదాలపై పడి పతి భిక్ష ప్రసాదించమని వేడుకుంటుంది .  కరుణించిన కైలాసపతి  కన్నులు తెరిచి , ఇదంతా తన లీలా విశేషమని , ‘శుభ తరుణం’ సమీపించగానే  మన్మధుడు  పునర్జన్మ పొందగలడని  ఊరడించి పంపుతాడు . 


             తిరోగమించిన సుమశరం  హిమాలయము చేరి హైమావతి ఎదలో సున్నితం గా నాటుకుంటుంది .  తత్ఫలితంగా  ఆమె లో భావసంచలనం కలుగుతుంది .  మధుర భావనలతో  ఆమె ఏకాగ్రత కోల్పోతుంది .  ఈ పరివర్తనమునకు కారణమేమిటో  తెలియక  గిరిరాజ సుత తికమకపడుతుంది . ఇది ప్రకృతి స్వరూపిణి అయిన గిరిజను  మాయాచిద్విలాసం తో  సంకల్పం నుండి కించిత్తు తపోభంగం మొనరించిన శివమాయా ప్రభావము . 


    తన  చిన్ముద్రను వీడి  పార్వతిని పరిగ్రహించే  ‘శుభ తరుణం’  సమీపించిందని  శంకరునకు అవగతమైంది .  దీక్షను వీడి  కైలాసపతి  హిమాలయం వైపు , పార్వతి తపోభూమి  దిశగా  కదిలాడు .  శంకరునకు  పార్వతి మనోగతం పరోక్షంగా , ప్రచ్ఛన్న వేషధారియై  తెలుసుకోవాలన్న చిలిపి కోరిక కలిగింది . 
వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి  తపోభూమిని దర్శించాడు .  పండు ముసలి అయినా, మూర్తీభవించిన శివత్వం లా  దివ్య ప్రభాసమైన  ఆ తేజోమూర్తిని  తగురీతిని  స్వగతం పలుకుతుంది ఆ గిరిరాజ తనయ. 


    సకారణం గా, సహేతుకం గా శివుని పొందు సముచితం కాదని  ఆ వృద్ధ తాపసి   పార్వతికి హితవు చెబుతాడు .  ‘  ముసలి ఎద్దునెక్కి  మరుభూముల్లో  సంచరించు  మహాదేవునిపై  మరులుగొన్నావా ?  ఎంత మందమతివి కల్యాణీ ?” అన్న పరుష వాక్యం పార్వతి శిరీష కోమల హృదయం లో  పదునుగా నాటుకుంది .  కలత చెందిన కాత్యాయిని  ఆ వృద్ధ తాపసికి  మహేశ్వర తత్వం వివరించి మహాదేవునిపై తనకు గల అచంచల  భక్తి ప్రపత్తులను సగర్వం గా చాటుకుంటుంది . 


ప్రసన్నుడైన పరాత్పరుడు నిజరూపం లో  గిరిరాజ తనయను అనుగ్రహిస్తాడు .  పాణిగ్రహణం చేసే శుభతరుణం అతి చేరువ లోనే ఉన్నదని  ఆశీర్వదించి  భయంకరుడు అంతర్ధానమవుతాడు .  శివప్రేరితులై  సనకసనందాదులు  హిమవంతుని కలిసి కైలాసపతి  మనోగతం  ఆ పర్వత రాజుకు వివరిస్తారు .  పరమానందభరితుడైన  హిమవంతుడు గౌరీ శంకర కళ్యాణానికి  అమితానందం తో ఆమోద ముద్ర వేస్తాడు . శివ-శక్తి  సమాగమంతో  సుబ్రహ్మణ్యుడు ఉద్భవిస్తాడన్న మహామునుల కధనం పార్వతి హృదయాన్ని  పులకింపజేస్తుంది .  పర్వతరాజు  ప్రార్థన మేరకు  విశ్వకర్మ  దేవతాకోటికి  విడిది గృహాలను  నిర్మించుటకు అంగీకరించాడు . 


బ్రహ్మాది దేవతలు  కైలాసం చేరారు . దివ్య ప్రభలతో  చిరునవ్వులు చిందిస్తున్న శంకరుని  పెళ్లి కుమారుని చేయాలనీ  వారి శుభ సంకల్పం . శాస్త్రోక్తంగా  శంకరుడు పెళ్ళికొడుకు అయినాడు .  పార్వతిని భువన మోహనంగా  అలంకరించారు . నునుసిగ్గుల వధువు  తల్లిదండ్రులకు నయనానందకర గా  కనిపించింది ..  బ్రహ్మాది దేవతలు  వెంటరాగా పరమేశ్వరుడు పెళ్లికొడుకై హిమవంతుని నగరానికి బయలుదేరాడు .  విడిది ద్వారం వద్ద కాబోయే అల్లుడిని , బ్రహ్మాండ నాయకుని  గిరి రాజు సమాదారం గా ఆహ్వానించాడు . శంకరాది  దేవతా ప్రముఖులను ఉచితరీతిని సత్కరించాడు . 

శివ- పార్వతుల కళ్యాణం లోక కళ్యాణం కనుక భూమిపై నివశించే  సమస్త మానవాళి  ఆ పెళ్లి వేడుకలను తిలకించి , పులకించి పోవాలనుకుంటుంది .  ఈ విషయం గ్రహించిన  శంకరుడు  భూభారమంతా  ఒక్క వైపుకే  ఒరిగిపోతుందని భావించి కాశీ లో స్థిర నివాస ముంటున్న  అగస్త్య మహర్షిని  రమ్మంటాడు .  ప్రజాభారం తో ఉత్తరపు దిక్కునకు ఒదిగిపోవు భూమిని  సమతుల్యం చేసేందుకు అగస్త్యుని  దక్షిణాపథం  వెళ్ళమని ఆదేశిస్తాడు . శివాజ్ఞ  గౌరీ శంకర కళ్యాణం చూడాలన్న ఆగస్టుని అభిలాషకు  అవరోధమవుతుంది . 

మహర్షి మనోరధం గ్రహించిన మహాదేవుడు  దక్షిణాపథం నుండే కల్యాణ వేడుకలు తిలకించే వరం ప్రసాదిస్తాడు . 

 

నారద మహర్షి  పొగడ్తలకు  పొంగిపోయిన  వింధ్యుడు  ( వింధ్య పర్వతం )  ఆకాశమంత  ఎత్తు ఎదిగాడు .  ఈ పరిణామం తో  దేవతలు భయపడ్డారు .  వింధ్యుడి గర్వాతిశయము అణచి  లోక కళ్యాణము చేయవలెనని  అగస్త్య మహర్షి  నిశ్చయించుకుంటాడు .  మహర్షి సంకల్పం  మహాదేవుని దీవెనలతో  ద్విగుణం బహుళం అవుతుంది . 


ఈశ్వరాజ్ఞ బడని  దక్షిణా పథమునకు   బయలుదేరిన  అగస్త్యుడు వింధ్య పర్వత దిశగా  ప్రయాణమయ్యాడు . మార్గమధ్యమున  మాయాపురి అడ్డగించింది .  మయపురాధీశుడు  క్రౌంచాసురుడు  అగస్త్యుని చంపదలిచాడు .  పర్వతరూపమున  మహర్షిని అడ్డుకున్నాడు .  అతడి మాయను గ్రహించిన  అగస్త్యుడు  తన దండముతో  పర్వతమును తాకగానే అది తునాతునకలైంది .  ఆ విధంగా  క్రౌంచాసురుని  గర్వము  ఖర్వము అయింది .  శివ కుమారుని చేతిలో  ఆ అసురుని మరణం  సంభవింపనున్నది  గనుక తన తపోశక్తి తో  మహర్షి అతడి మాయాశక్తులన్నీ హరించి వేశాడు .  క్రౌంచుడు  కేవలం  శిలా  పర్వతం గా మిగిలిపోయాడు .  

                                                                                                                                  కొనసాగించండి 06 లో