OM SARAVANA BHAVA - 6 books and stories free download online pdf in Telugu

ఓం శరవణ భవ - 6

అమేయంగా ఎదిగిన వింధ్యను సమీపించాడు అగస్త్యుడు .  దక్షిణాపథము  వెళ్ళుటకు  దారి విడువుమని వింధ్యుని  ఆదేశించాడు .  గ్రహ నక్షత్ర గతులకే  అవరోధం కల్పించిన  వింధ్యడు  గర్వాతిశయము తో మహర్షి మాటలను నిర్లక్ష్యం చేశాడు .   వెంటనే అగస్త్యుడు  వింధ్యుని తల మీద  తన అరచేతిని  ఉంచి బలంగా నొక్కాడు . ఆ ఒత్తిడికి వింధ్యుడు పాతాళమునకు కృంగాడు . మహర్షి మహిమను అవగతం చేసుకున్న వింధ్యుడు  అగస్త్యునికి శరణాగతుడయినాడు . తన పూర్వ వైభవం  తిరిగి పొందేలా కనికరించమని  వింధ్యుడు  మహర్షిని వేడుకుంటాడు .  తిరుగు ప్రయాణం లో  వింధ్యు డి కోరిక తీరగలదని  మహర్షి దీవిస్తాడు .  కానీ, దక్షిణాపథమును  చేరిన అగస్త్యుడు నేటి వరకు ఉత్తరాభిముఖంగా  పయనించలేదు .  వింధ్యుడి అభీష్టము నెరవేరలేదు .  గర్వాతిశయం  ప్రగతికి అవరోధమన్న పరమ సత్యం  వింధ్యుని ఉదంతం ద్వారా  మనకు అవగతమవుతుంది . 

                                                               

  పార్వతీ కళ్యాణం  పరాత్పరుడి తో    రంగరంగ వైభవం గా జరిగింది .  పరమేశ్వరుని  పాదాలు కడిగి కన్యాదానం చేసి హిమవంతులు  చరితార్థులైనారు . సమస్త దేవతా గణము  , మానవాళి  ఆయా కల్యాణ వేడుకలు కన్నులారా తిలకించి  మేను  పులకించగా  పునీతులైనారు . 


         వేదోక్తంగా, శాస్త్రసమ్మతంగా, సర్వలక్షణ సమన్వితం గా జరిగిన  కల్యాణ మది .  చిరకాలానికి ఆదిదంపతులు ఒకటైన వేళ  సమస్త సృష్టి  చైతన్యమయినది .  దంపతుల నడుమ సహజంగా సాగే  రతిక్రీడా కౌతుకము పునరుద్ధరింపబడు ‘ శుభ తరుణం’ సమీపించింది . 


                  కళ్యాణ వైభవం దక్షిణాపథము చేరాక  తిలకిస్తూ, తన తపోబలమునకు అమేయమైన శివశక్తి తోడు రాగా  అగస్త్య మహర్షి భూభాగాన్ని  సమతుల్యం చేశాడు . 


          వివాహవేడుకలు  పూర్తయినవి .  ఆదిదంపతులు అద్భుతమైన ఉద్యానవనాలలోను , కొండచరియలలోనో, ప్రకృతీ పురుషులుగా కలిసిమెలిసి , కేళీవిలాసాల్లో  మునిగి తేలుచున్నారు . అందువల్ల సకల భువనాల్లోనూ దంపతుల సరస సల్లాపములు , శృంగార భరితమైన , లైంగిక పరమైన  చేష్టలు పునరుద్ధరింపబడినవి . శివానుగ్రహము తో మన్మధుడు రతీదేవిని క్షణకాలమైనా  విడువకుండా కామకేళీ విలాసాల్లో మునిగి తేలుతున్నాడు . ఇంతకాలం అనంగుడు సుమశరము లేనిదే సృష్టి జరుగదని భ్రమలో ఉన్నాడు .  సృష్టికి మూలం  ఆదిదంపతుల అనురాగము , ఆకర్షణ అన్న పరమ సత్యం మరచాడు .   ఇప్పుడు ముక్కంటి కోపాగ్ని జ్వాలల్లో తప్త కాంచనం లా పునీతుడై , పరాత్పరుడి  సంకల్పమునకు  క్రియా రూపమై  తన జన్మ తరింపజేసుకుంటున్నాడు . 

                                                              
శ్రీమన్నారాయణుడు  ప్రయోగించిన సుదర్శన చక్రం  తారకాసురుడి మెడ లో సువర్ణ పతాకం గా   ఒదిగిపోవటం చూసిన దేవతలు బెంబేలు పడి  పోయారు .   వారికీ దిక్కు తోచలేదు .  దేవతా రక్షకుడైన శ్రీహరే  తా రకుని ముందు  ఓటమిని అంగీకరించవలసివచ్చింది .   ఇక తమను ఆదుకునే దిక్కెవరు ?  ఈ విషయం గా వారు పరంధాముని  ప్రశ్నించారు .  అందుకు పురుషోత్తముని సమాధానం ఇలా ఉంది . ______  “ తామసులైన  సోదర త్రయం తపోబలం చే విశ్వవిజేతలైనారు .   వారి తపోబలానికి శివానుగ్రహం తోడయింది . అందుకే నా శక్తి వారి ముందు నిర్వీర్యమైంది .  ప్రస్తుతం మనకు కావలిసింది సాహసం కాదు ...... సమయస్ఫూర్తి  రాక్షసుల పాపాలు పండువరకు మనము వేచి ఉండక తప్పదు . వారికి అనుకూలంగా మెలిగి పరువు దక్కించుకొనుట  ఉత్తమం”. 

             విష్ణువు, బ్రహ్మాది దేవతలు  శూరపద్ముని సందర్శిస్తారు .  అతడి ఘనతను వేనోళ్ళ కొనియాడుతారు . వారి పొగడ్తలకు పరమానందభరితుడైన  శూరుడు  ఉపయుక్తమైన నగర నిర్మాణం కొరకు దేవతలను పురమాయిస్తాడు .  విశ్వకర్మ శుక్రాచార్యుని సంప్రదించి స్థల నిర్ణయం చేస్తాడు .   దక్షిణ సముద్ర మధ్యమున ఎనభై వేల  యోజనాల విస్తీర్ణం లో విశ్వ కర్మ నగర నిర్మాణం  చేపడతాడు .  సముద్రం లో కొండలను ఉంచి వాటిపై అద్భుతమైన  రీతిలో నగరం నిర్మించడం జరిగింది .  పరిపాలనకు అనువైన అన్ని వసతులు అందులో సమకూర్చబడినవి . 


      ఇక శూర పద్ముని  పట్టాభిషేకమే  మిగిలింది .  త్రిమూర్తులు , సమస్త దేవతలు కొలువై వున్న  నిండు పేరోలగం లో రాక్షస వీరుని  పట్టాభిషేకం  అతివైభవ గా, నయనానందకరం గా  జరిగింది .  ఇక్కడ మరో విశేషం —- పట్టాభిషేకమునకు  అవసరమైన  అన్ని ద్రవ్యములు సమస్త దేవతలే సమకూర్చారు . 


     పట్టాభిషిక్తుడైన శూరపద్ముడు  ఓ  ఇంటివాడు కూడా అయ్యాడు .  దేవశిల్పి  కుమార్తె పద్మ కోమలను  అర్థాంగిగా చేపట్టాడు .  యమ పుత్రికను సింహముఖుడు,  నిరృతి  పుత్రికను తారకాసురుడు పరిణయమాడారు .  కాలక్రమేణా వారికీ పుత్రోదయం సంభవించింది .  శూరపద్ముని కొడుకులు —-- భానుకోవుడు , అగ్నిముఖుడు ,  హిరణ్యుడు ,  వజ్ర బాహుడు .  సింహముఖునికి  శూరుడు,  తారకాసురుడికి  అసురేంద్రుడు జన్మించారు .  ఈ అసురేంద్రుడు వివేకి, వినయశీలి . 


             శూరపద్ముడు  అసురుడే కావచ్చు ; లోక కంటకుడే కావచ్చు;  కానీ, అతడు అమేయ తపోబల సంపన్నుడు . దీక్షాదక్షతల నిధి . భక్తి తత్పరతలో పరమ మాహేశ్వరుడు .  ఈ విశేష గుణములన్నీ  రక్షణ కవచములై అతడిని సమస్త విశ్వమునకే  అధిపతిని చేసినవి .  సృష్ట్యాది నుండి నేటి వరకు  వెయ్యిన్ని ఎనిమిది అండ ములకు  ప్రభువైన వాడు  శూర పద్ముడొక్కడే .   అంతటి  మేరు  నగ ధీరుడు , కర్మవీరుడు సహజమైన అసుర ప్రవృత్తికి లోనై  స్థితప్రజ్ఞత చూపలేకపోయాడు . హృదయం లో కైవల్య సోపానములైన దైవీ గుణాలను నిలుపక అధోగతి పాలయినాడు . దేవతలతో కలహించి  కడగండ్ల పాలయినాడు . కడకు రాక్షస జాతి క్షయమునకు తానే ప్రబల కారణమైనాడు . 

దక్ష ఉదంతం  నుండి నేటివరకు  స్కాంద పురాణం లో     ఏ    సంఘటన ను పరికించినా  మనకు తామస గుణమే ప్రధానం గా కనిపిస్తుంది .  అందుకే ఇది తమో గుణ ప్రధానమైన పురాణమయింది . ఈ తమో గుణమును అధిగమించి  ఎవడు సాత్వికుడై ఈశ్వర ధ్యానం చేయగలడో వాడు విశుద్ధ జ్ఞానంతో ముక్తిని పొందగలడు .  ఈ పరమ సత్యమే  ఈ పురాణమందు ఆవిష్కరింప బడినది . 


  పట్టాభిషిక్తుడైన   శూరపద్ముడు ‘రాక్షస పాలన ‘ ప్రారంభించాడు .  ఆనాటి నుండే  దేవతలా కష్టాలు కూడా ఆరంభమైనాయి .  అమరాధిపతి  ఇంద్రుడు శూరునకు విధేయుడై అతడి రాజ్యం లో  వ్యవసాయం నిర్వహించాడు .  అగ్నిదేవుడు వంటశాలకు అంకితమైనాడు . నగర పారిశుద్ధ్యము వరుణుని వంతయింది . అన్ని ఋతువులలోను వాతావరణం చల్లగా ఉంచటం వాయుదేవుని విధి . ఇలా దిక్పాలురు దిక్కు లేనివారై  శూరుని రాజ్యం లో ఊడిగం చేయవలసి వచ్చింది .  ఈ సంఘటన పాండవుల అజ్ఞాతవాసమును  జ్ఞప్తికి తెస్తుంది .    విధి బలీయమైంది .  కర్మ ఫలమును ఎవరూ తప్పించుకొనలేరు కదా !  ఈ దుర్బలమైన హేయమైన  కర్మ పరిపాకమును  ఎంతో  కలం భరించలేకపోయారు . అందుచే  శూరపద్ముని హింస నుండి తప్పించుకునేందుకు మహామేరు పర్వత గుహల్లో తలదాచుకుంటారు.

దేవతలు నారద, బృహస్పతి సమక్షం లో తమ కష్టాల గురించి చర్చించుకున్నాక —-- మళ్ళీ శివ దర్శనం చేయాలనీ నిర్ణయించుకున్నారు . 

 

********************************************************************************************************************

                                                                                                                             కొనసాగించండి 07 లో