OM SARAVANA BHAVA - 08 books and stories free download online pdf in Telugu

ఓం శరవణ భవ - 8

              షోడశ కళలకు  ప్రతిరూపం గా   పదహారు ఆకృతులలో  , తన సంకల్పమునకు  తగిన గుణ రూప .విశేషాదులతో  వెలసిన  కుమార స్వామి  పరిపూర్ణ అవతార పురుషుడు .  ఈ రూప వైవిధ్యం  కాదు ఆసక్తికరం . జ్ఞాన మోక్ష దాయకం . 


  నిప్పు రవ్వ కైనా, నిటలాక్షుని జ్వాలకైనా  దహనగుణం ఒక్కటే .  ధర్మం లో ఏమాత్రం తేడా ఉండదు .  ఇదే పోలిక  సుబ్రహ్మణ్యుని  విషయం లోనూ , సదాశివుని విషయం లోనూ వర్తిస్తుంది .  బాలుడైనా,  కార్తికేయుడు  పరిపూర్ణ అవతార పురుషుడు .  పరాత్పరునకు  ఏమాత్రం  తీసిపోడు  .   కానీ, మాయామోహితులైన దేవతలు  ఈ సత్యం గ్రహించక  షణ్ముఖుని శక్తి యుక్తుల విషయం లో  సందేహాలు వ్యక్తం చేస్తారు . 


   శివకుమారుని  బాల్య క్రీడలు  వినోద , విస్మయ భరితములై  తల్లిదండ్రులనే కాక కైలాసవాసులందరినీ ముగ్ధులను చేస్తున్నాయి .   ముద్దులొలికే రూపం తో ,  కాలి  అందె ల సవ్వడితో   నయనానందకరం గా  సంచరించు కుమారుడు  కైలాసవాసుల  కంటి వెలుగైనాడు . 


      ఈ అనంత విశ్వమే  స్కందుని  విహార స్థలం . విభిన్న రూపాలతో  చిత్ర విచిత్ర గతులలో  దర్శనమిచ్చే  కుమారుడు  త్రిలోకాలలో  ఒక ఆకర్షణ !  సమాధానం లేని చిక్కు ప్రశ్న . 


   శివకుమారుని  లీలలు  రాక్షసులకు  అంతు  చిక్కడం లేదు .  అవి వారి మేధస్సుకు  అందని జటిల సమస్యలా మారాయి .  ఇవి త్రిమూర్తులకు  అంతు  చిక్కని లీలలని  భ్రమించారు  రాక్షసులు .  మర్త్యలోకం లో ప్రజలు ఇందుకు భిన్నం గా  ఈ లీలలు చూసినప్పుడు  రాక్షస బాధ నుండి  రక్షించే ‘ శక్తి’  ఉద్భవించిందని మురిసిపోయారు . 


 రాక్షస భయం తో  అనుక్షణం తల్లడిల్లిపోయే  దేవతలు  అజ్ఞానవశులై  ఆ చిత్ర విచిత్ర మూర్తిని  ప్రతిఘటించి భంగపడ్డారు .   అదృశ్యుడైన  సుబ్రహ్మణ్యుని  ఎదిరించి  చాలామంది మరణించారు .  మిగిలినవారు  ప్రాణభీతితో   తలో దిక్కుకు  పారిపోయారు . 


ఈ విషయం నారద మహర్షి ద్వారా  తెలుసుకున్న బృహస్పతి  తల్లడిల్లిపోయాడు . కార్తికేయుని  స్మరించాడు . శివకుమారుడు ప్రత్యక్షమైనాడు .  దేవ గురువు బృహస్పతి  అభీష్టం మేరకు మరణించిన దేవతలకు  ప్రాణదానం చేశాడు . 


ఇదంతా కేవలం  కుమారస్వామి లీలే .  తాను పసివాడని  సందేహాలు వ్యక్తపరచిన దేవతలకు  కనువిప్పు కలిగించాలని  శివకుమారుని సంకల్పం .  గుణపాఠం నేర్చుకున్న  దేవతలు సుబ్రహ్మణ్యునికి  శరణాగతులైయ్యారు .  వారిని కనికరించిన  కుమారుడు  తన విశ్వ రూపం చూపి   విస్మయం కలిగించాడు .  తన రూపాన్ని  పరిపూర్ణం గా  అవలోకించుటకు  శివకుమారుడు  దేవతలకు  దివ్య చక్షువులు  అనుగ్రహించాడు .  

సుబ్రహ్మణ్యుడు తన విశ్వ రూపం లో  త్రిమూర్తులను , శక్తి త్రయమును , అష్ట దిక్కులను , పదునాలుగు లోకాలను , సప్త సముద్రాలను , సమస్త ప్రాణులను , దేవతలను  చూపాడు .  జగదీశ్వరుడు తన ప్రాణం గాను , జగదీశ్వరి తన ఆత్మగాను  వారికి కనిపింప జేశాడు . వారికి నీతి , ధర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య బోధ కూడా చేశాడు . 

        సుబ్రహ్మణ్యుని విశ్వరూప సందర్శనం తో  దేవతల భ్రాంతి , భయాదులు తొలగి పోయాయి .  శూర  పద్మాది రాక్షసులను  కుమారుడు అవలీలగా సంహరించగలడన్న  నమ్మకం వారికి కలిగింది . 


కైలాసగిరి లోనే  కుమారస్వామికి  అందమైన, అనువైన నివాసం  ఏర్పాటు చేయాలని దేవతలు సంకల్పిస్తారు .  స్థల నిర్ణయం జరుగుతుంది .  విశ్వకర్మ పట్టాన నిర్మాణానికి  పూనుకుంటాడు .  ఆ దేవశిల్పి  అసమాన కల్పనా చాతుర్యమునకు  మారుపేరుగా ‘ స్కందగిరి’  పట్టణ నిర్మాణం జరిగింది . 


 ఓ శుభ ముహూర్తాన  త్రిమూర్తుల సమక్షం లో  దేవ భూత గణాలు మంత్రోక్తం గా , దేవ సమ్మతం గా  షణ్ముఖుని దేవ  సేనాధిపతిగా  అభిషిక్తుని  చేశారు . 


    ఒకనాడు పరమ శివుని  ప్రీత్యర్థం  నారద మహర్షి ఓ యాగం నిర్వహించాడు .  ఆ మహాక్రతువుకు ముని శ్రేష్ఠులు , దేవతలు వచ్చేశారు .  ఉన్నట్లుండి  యాగ గుండం లో  అద్భుతం గా ఒక మేక ఆవిర్భవించింది , దాని భయానక రూపం చూసి  అక్కడి వారందరూ  భీతితో  పరుగులు దీశారు . అది పెను శబ్దం తో  వారిని వెంటాడింది . లోకమంతా చుట్టి  అనేకమందిని సంహరించింది . 


నారదాది మునివర్యులు కైలాసానికి పరుగులు దీశారు . దారిలో శ్రీ స్కందగిరి లోని  సుబ్రహ్మణ్యుని చూసి  జరిగింది చెప్పారు . శివకుమారుడు వారికి అభయమిచ్చారు . తన అనుచరుడైన వీరబాహుని పంపి  సత్యలోకం లో ఉన్న  ఆ మేషమును  తన చెంతకు తెప్పించుకున్నాడు  షణ్ముఖుడు .  ఈ అవాంతరం తప్పినందున  యజ్ఞం నిర్విఘ్నం గా  సాగింది .  దేవతల అభీష్టం మేరకు శివకుమారుడు  మేషమును తన వాహనం చేసుకున్నాడు . 


రాశి చక్రం లో మొదటి రాశి మేషము. మేషరాశికి  అధిదేవత సుబ్రహ్మణ్యుడు .  కనుక పై ఉదంతం ఈ సృష్టి నియమమునకు  ఉపయుక్తంగా ఉంది . 


ఎంతటి వారికైనా వినయం ఉండాలి .  వినయం  నిండైన  విజ్ఞానానికి సంకేతం . వినయ రాహిత్యం అహంకారానికి మూలం . అహం అతిశయించిన నాడు  మనిషి అజ్ఞానం పాలవుతాడు .  ఈ సూత్రం  మర్త్యులకే కాదు , దేవతలకూ వర్తిస్తుంది . 


శివ కుమారుని పరిపూర్ణత్వమును దేవతలే కాదు , సాక్షాత్ బ్రహ్మ కూడా  గుర్తించలేక పోయాడు .  షణ్ముఖుడు  బాలుడన్న  భ్రమ  బ్రహ్మను కూడా ఆవరించింది . 


ఒకనాడు  దేవతా సమూహం  వెంట రాగా  పరమేష్ఠి  పరమేశ్వరుని దర్శించ కైలాసం చేరాడు .  దారిలో స్కందగిరిని  చూసి కూడా  షణ్ముఖుని దర్శించక  ముందుకు సాగిపోయాడు .  ఈ నిర్లక్ష్యమును  నిటాలాక్ష సుతుడు భరింపలేకపోయాడు .  బ్రహ్మకు జ్ఞానోదయం చేయదలచాడు .  పరమేష్ఠిని పిలిపించి  కొంత సంభాషణ సాగిన పిమ్మట ప్రణవార్థమును  వివరించమని  బ్రహ్మను ప్రశ్నిస్తాడు .  అజ్ఞానం, వివేకమును తెరలా  కమ్మిన కారణం గా  సత్య లోకాధిపతి ప్రణవార్థమును  వివరించలేక  తటపటాయిస్తాడు .  సృష్టి రచన చేయువానికి  సృష్టికి మూలమైన  ప్రణవ రహస్యం తెలియక పోవటం  చాల శోచనీయమని  షణ్ముఖుడు  బ్రహ్మను బంధిస్తాడు .  ఆ క్షణం నుండీ  సృష్టి కార్యం  తానే , దీక్షాధరుడై  నిర్వహిస్తాడు .  ఇలా కొంత కలం సాగుతుంది . 

 

*********************************************************************************************************************                                                                                                                                                 కొనసాగించండి 09 లో