మనిషి ఎందుకు పనిచేస్తాడు? జీవనోపాధి కోసం, కుటుంబ పోషణ కోసం, సమాజానికి తన వంతు సేవ చేయడం కోసం. అయితే భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలో మానవ జీవితం కేవలం ఉపాధి సంపాదనకే పరిమితం కాదు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం మోక్షం, అంటే జనన–మరణ చక్రం నుండి విముక్తి అని బోధిస్తున్నాయి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, రాజయోగం అనే నాలుగు మార్గాలను సూచించాడు. వీటిలో ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో సులభంగా ఆచరించగల మార్గం కర్మయోగం.
కర్మయోగం అంటే ఏమిటి?
కర్మయోగం అంటే కేవలం పని చేయడం కాదు; ధర్మబద్ధంగా, నిస్వార్థంగా, ఫలాపేక్ష లేకుండా, భగవంతునికి అర్పణ భావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఇది బాహ్య సన్యాసం కాదు, అంతరంగ వైరాగ్యం. కుటుంబంలో ఉన్నా, ఉద్యోగం చేస్తూనా, వ్యాపారం నిర్వహిస్తూనా, సమాజ సేవలో నిమగ్నమైనా—ప్రతి కార్యాన్ని భగవదర్పణంగా భావించి సమత్వంతో చేయడమే కర్మయోగం. కర్మను విడిచిపెట్టడం కాదు, కర్మలోని స్వార్థాన్ని విడిచిపెట్టడమే గీత బోధించిన కర్మయోగ సారాంశం. అందుకే కర్మయోగం ఆధ్యాత్మికతను దైనందిన జీవితంతో ముడిపెట్టే అత్యంత ఆచరణీయమైన మార్గంగా భావించబడింది.
భగవద్గీత ప్రకారం ప్రతి మనిషి తన స్వధర్మాన్ని నిష్ఠతో ఆచరించినప్పుడు పరిపూర్ణతను పొందగలడు. సమాజంలో వృత్తులు, బాధ్యతలు భిన్నమైనా, వాటి విలువలో ఎలాంటి తేడా ఉండదు. న్యాయమూర్తి చేసే సేవ ఎంత గొప్పదో, వీధిని పరిశుభ్రం చేసే కార్మికుని సేవ కూడా అంతే గొప్పది. పనిలో ఉన్నత–నిమ్న భావనలు మనిషి సృష్టించినవే తప్ప, ధర్మం దృష్టిలో ప్రతి నిజాయితీతో చేసిన పని పూజతో సమానం.
శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశిస్తాడు:
"స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః"
(భగవద్గీత 18.45)
అంటే ప్రతి వ్యక్తి తన విధిని సమర్థంగా నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణతను పొందుతాడు.
నేటి పోటీ ప్రపంచంలో చాలామంది తమ అభిరుచికి అనుగుణమైన వృత్తిని కాకుండా, అధిక ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని లేదా లభించిన ఉపాధిని ఎంచుకోవలసి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కూడా చేస్తున్న పనిని భగవంతుని సేవగా భావించి, అంకితభావంతో చేయడమే కర్మయోగం.
సాధారణంగా మనిషి చేసే ప్రతి పనిలో ప్రతిఫలం, గుర్తింపు, ప్రశంస లేదా వ్యక్తిగత లాభం కోసం ఆశ ఉంటుంది. ఈ స్వార్థమే అసంతృప్తికి, మానసిక ఒత్తిడికి, బంధాలకు కారణమవుతుంది. స్వామి వివేకానంద ఒక సందర్భంలో "స్వార్థంతో చేసిన పని అనైతికం; నిస్వార్థంతో చేసిన పని నైతికం. పనివల్ల కాదు, స్వార్థం వల్లే దుఃఖం కలుగుతుంది" అని పేర్కొన్నారు.
వేదాంతం ప్రకారం స్వార్థానికి మూలం మమకారం. "ఇది నాది", "ఇది నా సంపద", "నా ప్రతిష్ఠ", "నా కుటుంబం" అనే భావనలే బంధనాలను పెంచుతాయి. నిజానికి ఈ జగత్తులో ఉన్నదంతా పరమాత్మదే. మనిషి కేవలం బాధ్యతలను నిర్వర్తించే సాధనమాత్రమే.
భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం ఈ సత్యాన్ని తెలియజేస్తుంది.
"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి ॥"
(భగవద్గీత 2.47)
అంటే నీకు కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మాత్రమే ఉంది; ఫలితంపై కాదు. ఫలితానికి నీవే కారణమని భావించకు. అలాగే కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు.
కర్మయోగం అంటే ఫలితాలను నిర్లక్ష్యం చేయడం కాదు; వాటిపై మమకారం లేకుండా ఉత్తమంగా పని చేయడం. విజయం వచ్చినా అహంకారం లేకుండా, అపజయం వచ్చినా నిరాశ చెందకుండా సమభావంతో ఉండటమే నిజమైన యోగస్థితి.
ఈ భావాన్ని శ్రీకృష్ణుడు మరొకచోట ఇలా వివరిస్తాడు:
"యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥"
(భగవద్గీత 2.48)
నిస్వార్థ కర్మను అలవర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం ప్రతి పనిని భగవంతునికి అర్పణగా చేయడం. శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశిస్తాడు:
"యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః"
(భగవద్గీత 3.9)
అంటే భగవంతుని అర్పణ భావంతో చేయని పని బంధనానికి కారణమవుతుంది.
అలాగే ఆయన మరోచోట ఇలా చెబుతాడు:
"యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణమ్ ॥"
(భగవద్గీత 9.27)
అంటే నీవు చేసే ప్రతి పని, ప్రతి దానం, ప్రతి తపస్సు—అన్నిటినీ నాకు అర్పణగా చేయమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బాధ్యత నుండి తప్పుకోవాలని భావించినప్పుడు, శ్రీకృష్ణుడు వైరాగ్యం పేరుతో కర్తవ్యాన్ని విడిచిపెట్టడం నిజమైన సన్యాసం కాదని బోధించాడు. చివరగా ఆయన ఇచ్చిన ఆదేశం నేటి ప్రతి మనిషికీ వర్తిస్తుంది.
"మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥"
(భగవద్గీత 3.30)
నేటి యాంత్రిక జీవన విధానంలో పని ఒక భారం, ఒత్తిడి, పోటీగా మారుతోంది. ఇలాంటి సమయంలో కర్మయోగం మన పనిని భారంగా కాక, సేవగా చూడడం నేర్పుతుంది. కార్యాలయంలో నిజాయితీ, సమాజంలో బాధ్యత, కుటుంబంలో ప్రేమ, దేశం పట్ల అంకితభావం—ఇవన్నీ కర్మయోగానికి రూపాలే. మన కర్తవ్యాన్ని పరమాత్మకు సమర్పించినప్పుడు ప్రతి కార్యం యజ్ఞంగా, ప్రతి శ్రమ సాధనగా, ప్రతి రోజు ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది.
జీవితంలో పని తప్పనిసరి. కానీ ఆ పనిని స్వార్థంతో కాకుండా సేవాభావంతో, ఫలాపేక్ష లేకుండా, భగవంతునికి అర్పణగా చేసినప్పుడు అదే కర్మయోగం అవుతుంది. అలాంటి నిస్వార్థ కర్మ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించడమే కాక, సమాజానికి మేలు చేసి, చివరకు మనిషిని మోక్షమార్గంలో నడిపించే మహోన్నత సాధనగా నిలుస్తుంది.